వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో చక్కిన వాతావరణం!
ఒక్క వైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం 'కొంచెం ఇష్టం – కొంచెం కష్టం' అన్నట్లుగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు మండిపోతుండగా, సాయంత్రం ఈదురుగాలులతో వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి:
తెలంగాణలో మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుండగా, సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నిజామాబాద్‌లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు జిల్లాల్లో గాలివానలు విరుచుకుపడ్డాయి. ఖమ్మంలో వడగండ్ల వానతో మామిడి తోటలు నష్టం చవిచూశాయి.
వచ్చే 48 గంటల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం:
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాబోయే 3 రోజులు వర్షాలు పడే అవకాశముంది. అలాగే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశముండగా, ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంది. వానలు, ఎండలు కలగలిపిన వాతావరణం మరో నాలుగు రోజులు కనిపించనుంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.