రాత్రివేళ మెరిసిన భారత్‌ను చిత్రీకరించిన ఐఎస్ఎస్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) రాత్రివేళ భూమిని చిత్రీకరించిన అద్భుతమైన ఫొటోలు సోషల్ మీడియాలో భారీగా స్పందన తెచ్చుకున్నాయి. నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద ప్రకాశిస్తున్న భారతదేశాన్ని చూపిన ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఫొటోలలో మిడ్వెస్ట్ అమెరికాలోని మేఘావృత ప్రాంతం, ఆగ్నేయాసియా తీరప్రాంతాలు, ఆకుపచ్చ కాంతులతో కప్పబడి ఉన్న కెనడా కూడా కనిపిస్తాయి. భూమి వక్రత వల్ల ఆకాశం వంపుగా కనిపిస్తూ మరింత అందంగా ఉంది.
‘‘నక్షత్రాలు, నగర కాంతులు, భూమి వాతావరణ కాంతిని ఒకేసారి చూడగలిగినప్పుడు’’ అనే శీర్షికతో ఈ చిత్రాలను ఐఎస్ఎస్ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఇవి వెంటనే వైరల్ అయ్యాయి. ఐఎస్ఎస్ భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఎప్పటికప్పుడు ఇలాంటి అద్భుత దృశ్యాలు పంచుతోంది.