తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశముందని 'ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్' అనే సంస్థ ఇటీవల ట్వీట్ చేసింది. వారి పరిశోధనల ప్రకారం, రామగుండం పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ సమాచారం ప్రభుత్వ సంస్థలు లేదా శాస్త్రీయ సంస్థల ద్వారా అధికారికంగా ధృవీకరించబడలేదు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, భూకంపాలను ముందుగా అంచనా వేయడం సాధ్యపడదు, కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
గతంలో, 2024 డిసెంబర్ 4న ములుగు జిల్లా మేడారం దగ్గర 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపించాయి.
తెలంగాణా భూకంప తీవ్రత తక్కువగా ఉండే జోన్-2లో భాగంగా ఉంది. అయితే, గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ లైన్ ఉండటంతో అప్పుడప్పుడు స్వల్ప భూప్రకంపనలు నమోదవుతుంటాయి. గతంలోనూ ఈ ప్రాంతాల్లో జరిగిన భూకంపాలు పెద్దగా నష్టం కలిగించలేదు.
ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన హెచ్చరిక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, శాస్త్రీయ ధృవీకరణ లేకపోవడంతో ప్రజలు అపోహలకు లోనవ్వకండని అధికారులు స్పష్టం చేస్తున్నారు.