అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రకంపనలకు దారి తీసింది. ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగంపైనా పడుతోంది. ఈ పరిస్థితిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, ఆయన నేడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. తన లేఖలో, అమెరికా ప్రభుత్వం భారత్‌పై విధించిన 27 శాతం సుంకం వల్ల దేశీయ ఆక్వా రైతులు తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అమెరికా విధిస్తున్న అధిక సుంకాలను తగ్గించాలని, భారతీయ ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు కల్పించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఈ అధిక టారిఫ్‌ల కారణంగా ఇతర దేశాలు మన ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నాయని, ఫలితంగా రాష్ట్రంలోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేయడానికి స్థలమే లేకుండా పోతుందని ఆయన వివరించారు. మత్స్యరంగం రాష్ట్ర జీడీపీకి కీలక భాగంగా నిలుస్తోందని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు, ఈ సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు కేంద్రం నుంచి తగిన మద్దతు అవసరమని అన్నారు.
గందరగోళ పరిస్థితుల్లో ఉన్న ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.