ఆరోగ్య రంగంలో చంద్రబాబు పెద్ద ప్రకటన
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆరోగ్య సేవల విస్తరణకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలన్నారు. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్చువల్ వైద్యం & పీపీపీ విధానం
డాక్టర్లు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు వర్చువల్ విధానంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నిర్మించి, పరిశ్రమల తరహాలో సబ్సిడీలు ఇవ్వాలన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని అభివృద్ధి
అమరావతిని అంతర్జాతీయ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు కోసం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల్లో ముందస్తుగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.