ఏపీలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం నమోదు అయింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇద్దరేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ (H5N1) వైరస్‌తో మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ధృవీకరించాయి. పచ్చి కోడి మాంసం తినడంతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే చిన్నారి మరణానికి కారణంగా వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కారణంగా జరిగిన తొలి మరణం ఇదేనని అధికారులు స్పష్టం చేశారు.
మార్చి 4న జ్వరం, శ్వాస సమస్యలు, ముక్కు కారడం, విరేచనాలు, ఆహారం తీసుకోలేకపోవడం వంటి లక్షణాలతో చిన్నారిని మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మార్చి 7న చిన్నారి గొంతు మరియు ముక్కు నుంచి స్వాబ్ నమూనాలను సేకరించి పరీక్షించగా, బర్డ్‌ఫ్లూ అనుమానం వ్యక్తమైంది. మార్చి 15న శాంపిల్స్‌ను ఢిల్లీకి పంపగా, మరింత నిర్ధారణ కోసం మార్చి 24న పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. పరీక్షల అనంతరం, హెచ్5ఎన్1 వైరస్‌తో చిన్నారి మరణించినట్టు నిర్ధారణ అయ్యింది.
ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారి ఇంటి పరిసరాల్లో ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలు గల మరెవరూ లేరని అధికారులు తెలిపారు. ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్న సమయంలో పచ్చిమాంసం చిన్న ముక్క పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. ఉడికించిన మాంసం తిన్న కుటుంబసభ్యులకు ఎటువంటి సమస్యలు రాలేదని వారు వెల్లడించారు.