అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్-ఇండియా మూవీ ‘పుష్ప 2’ త్వరలో టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించగా, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఓటీటీలో విడుదలై అక్కడ కూడా అద్భుతమైన స్పందనతో రికార్డులు నెలకొల్పింది. ఇప్పుడు అదే ‘పుష్ప 2’ సినిమా ఏప్రిల్ 13న టీవీలో ప్రీమియర్ కానుంది.
ఇది టీవీలో తొలిసారి ప్రసారం అవుతుండటంతో రికార్డు స్థాయిలో టీఆర్పీలు సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ చిత్రం టీవీలో కూడా తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషల్లో ఒకేసారి ప్రసారం కానుంది.
తెలుగులో ఈ మూవీ స్టార్ మా ఛానెల్‌లో ఏప్రిల్ 13న (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించగా, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. శ్రీలీల ఒక ప్రత్యేక గీతంలో ప్రత్యేక ఆకర్షణగా మెరిసింది.