హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మార్చి 19 నుంచి ఏప్రిల్ 10 వరకు 19 మూల్యాంకన కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. ప్రతి సెంటర్‌లో 600 నుంచి 1200 మంది సిబ్బంది మూల్యాంకనలో పాల్గొన్నారు.
ఇప్పటికే ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ మొదలైంది. అంతా అనుకున్నట్టే జరిగితే, ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 25 లేదా 27 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. అధికారికంగా తేదీ ఖరారయ్యే అవకాశం ఉండగా, త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫలితాల విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంది. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 20 నాటికి పూర్తవుతుందని సమాచారం. దీంతో ఏప్రిల్ 20 తర్వాత ఎప్పుడైనా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించబడ్డాయి. జూన్ 1 వరకు సెలవులు ఉండగా, జూన్ 2 నుండి జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయి. పాఠశాలలకు కొత్త అకడమిక్ ఇయర్ జూన్ 12 నుండి ప్రారంభమవుతుంది.