టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2025) ఆన్‌లైన్ దరఖాస్తులు: ఈ రోజు నుంచే ప్రారంభం
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2025) ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. విద్యాశాఖ తన ప్రకటనలో ఏప్రిల్ 15 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఆసక్తి గల అభ్యర్ధులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2025) నోటిఫికేషన్ ఏప్రిల్ 11 (శుక్రవారం) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, రేవంత్ ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది మొదటి సెషన్ టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
టెట్ రాత పరీక్ష జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో, రోజుకు రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 గంటల వరకు ఉంటుంది. ప్రతి సెషన్ పరీక్ష 2.5 గంటలపాటు నిర్వహించబడుతుంది.
టెట్ పరీక్ష రెండు పేపర్లుగా నిర్వహించబడుతుంది. పేపర్ 1 పరీక్ష ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థులకు బోధించే వారు రాయాల్సి ఉంటుంది. వీరికి ఇంటర్ పరీక్షలో 50% మార్కులతో ఉత్తీర్ణతతో పాటు రెండు సంవత్సరాల డైట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పేపర్ 2 పరీక్ష ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు బోధించే వారు రాయాలి. అభ్యర్ధులు ఏదైనా డిగ్రీలో 50% మార్కులతోపాటు B.Ed లేదా స్పెషల్ B.Ed కోర్సు పూర్తి చేసి ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు 45% మార్కులతో పాసైతే సరిపోతుంది. డీఎస్సీ నియామక పరీక్ష రాయడానికి టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. డీఎస్సీ టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. అందుకే ప్రతి సారి ఈ పరీక్షలో పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు పోటీ పడతారు.
పేపర్ 1 లేదా పేపర్ 2కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్ల కోసం దరఖాస్తు చేసే అభ్యర్ధులు రూ.1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. D.Ed, B.Ed పూర్తి చేసిన నిరుద్యోగులతోపాటు కొత్తగా సర్వీస్ టీచర్లు కూడా టెట్‌కు హాజరవుతున్నారు. వారికి పదోన్నతులు కావాలంటే టెట్ పాస్ కావడం తప్పనిసరి. టెట్‌లో నెగెటివ్ మార్కింగ్ లేదు. అన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది.