అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రధాన ఈవెంట్ రెజిల్‌మేనియా 41కి భారత సినీ నటుడు దగ్గుబాటి రానా హాజరయ్యారు. రెజిల్‌మేనియాకు హాజరైన తొలి భారతీయ సెలబ్రిటీగా రానా ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈవెంట్ నిర్వాహకులు ఆయనకు ముందు వరుసలో సీటింగ్ కేటాయించగా, ఈవెంట్ సమయంలో రానా పేరును ప్రత్యేకంగా అనౌన్స్ చేయడం విశేషం.
రానా ఈ ఈవెంట్‌కు తన నూతన వెబ్‌సిరీస్ 'రానా నాయుడు' సీజన్-2 ప్రమోషన్‌లో భాగంగా హాజరయ్యారని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైన రెజిల్‌మేనియా వేడుకలో రానా కనిపించడంతో అంతర్జాతీయంగా భారత సినీ ప్రపంచానికి మంచి ప్రాధాన్యత లభించింది.
త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతున్న 'రానా నాయుడు' సీజన్-2 కోసం ప్రమోషన్స్‌ను నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఈ సిరీస్‌లో రానాతో పాటు ఆయన బాబాయ్ విక్టరీ వెంకటేశ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహిస్తున్నారు.