విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల ఆగ్రహం – క్షమాపణ డిమాండ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఇటీవల ఓ సినీ ఈవెంట్‌లో మాట్లాడిన సందర్భంగా, ఆయన ఉగ్రవాద దాడులను 500 ఏళ్ల క్రితం గిరిజన సంఘర్షణలతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు గిరిజన సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. తమను కించపరిచేలా ఉన్న ఈ మాటలపై వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం తమిళ నటుడు సూర్య నటించిన చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో చోటుచేసుకుంది. విజయ్ ముఖ్య అతిథిగా హాజరై, కశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఘటనపై మాట్లాడుతూ, ఉగ్రవాదులను మారుస్తేనే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. అయితే, "గతంలో గిరిజనులు ఎలా ఘర్షణలు చేశారో, ఇప్పుడు కూడా అదే రకంగా జరుగుతోంది" అన్న విధంగా ఆయన వ్యాఖ్యానించారు. దీనిలోని "ట్రైబల్స్" అనే పదం గిరిజనులకు అనుచితంగా అనిపించింది.
గతంలోని సంఘర్షణలను కేవలం గిరిజనులతోనే పోల్చడం తగదని, ఇది వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని సంఘాలు విమర్శించాయి. విజయ్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని, నిష్కపటంగా క్షమాపణ చెప్పాలని వారు స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన అలా చేయకపోతే, తాము ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టబోమని గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.