ఐపీఎల్‌లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు తమ ఖాతాలో ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. చెన్నై సొంతగడ్డపై సీఎస్‌కేను ఓడించిన తొలి సారి ఇదే కావడం గమనార్హం.
మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టుకు డెవాల్డ్ బ్రెవిస్ చేసిన 42 పరుగులే అత్యధికం. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు, 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ 44 పరుగులు, కమిందు మెండిస్ 32 పరుగులు చేశారు.
ఈ పరాజయంతో 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై జట్టు 7వ పరాజయం చవిచూసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. ఇక హైదరాబాద్ జట్టు 9 మ్యాచుల్లో 3 విజయాలతో 8వ స్థానంలో కొనసాగుతోంది.