తిరుమల శ్రీవారి సేవల నాణ్యతను మెరుగుపరచే దిశగా టీటీడీ కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం సేవ చేస్తున్న సేవకులకు శిక్షణతో పాటు, వివిధ రంగాల నిపుణులను కూడా సేవలో భాగస్వాములుగా చేసేందుకు టీటీడీ ఈవో జె. శ్యామలరావు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తిరుపతిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వైద్యం, విద్య, ఐటీ, క్యాటరింగ్, గోసేవ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్నవారిని సేవలో చేర్చేందుకు అవసరమైన ఐటీ మార్పులను సూచించారు. ప్రవాసాంధ్రులను కూడా సేవలో చేర్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. సేవకులకు ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇవ్వాలని ఈవో స్పష్టం చేశారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థ సహకారంతో ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ రూపొందిస్తున్నారు. మొదటగా ఏపీ 26 జిల్లాల నుంచి గ్రూప్ లీడర్లను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేసి, తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తారు. సేవా విధులు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా, ప్రాంతీయ, తిరుమల స్థాయిల్లో శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.