తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను ఇంటర్ బోర్డ్ (టీఎస్‌బీఐఈ) ప్రకటించింది. వేసవి సెలవులు మార్చి 30న ప్రారంభమై, జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలు ఈ సెలవులను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. అనధికారికంగా తరగతులు నిర్వహించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏదైనా కాలేజీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ దృష్టికి తీసుకురావాలని సూచించింది.
ఇంటర్ బోర్డు విద్యార్థులకు వేసవి సెలవులను స్వీయ అధ్యయనం, నైపుణ్య అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సూచించింది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి, జూన్ 2న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది.
ఇక ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనం వేగంగా జరుగుతోంది. ఏప్రిల్ నెలాఖరుకల్లా ఫలితాలను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమాధాన పత్రాల మూల్యాంకనంలో పారదర్శకతను పాటించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అన్ని ప్రక్రియలు సజావుగా సాగితే, ఈ నెలాఖరుకు ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.