తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రాష్ట్ర శాసనసభలో చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఉప ఎన్నికలు రావని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. గతంలో బీఆర్ఎస్ నాయకురాలు కె. కవితకు బెయిల్ మంజూరు చేసినప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేయకుండా వదిలేయడం తప్పయిపోయినట్టుంది అని ఆగ్రహం వెలిబుచ్చింది.
జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ ఎ.జి. మసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అంశంపై సభలో చర్చించవద్దని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరినా, ముఖ్యమంత్రి తన ప్రకటనను కొనసాగించారని కోర్టుకు తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సుందరం కోర్టుకు వినిపించారు. "సభ్యులెవరూ ఉప ఎన్నికల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పీకర్ తరపున నేను చెబుతున్నాను. ఎటువంటి ఉప ఎన్నికలు రావు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కోరుకున్నా ఉప ఎన్నికలు జరగదు. వారు ఇక్కడకు వచ్చినా, అక్కడే ఉన్నా ఉప ఎన్నికలు ఉండవు" అని ముఖ్యమంత్రి అన్నట్లు సుందరం కోర్టుకు వివరించారు. స్పీకర్ తన తరపున ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా మౌనంగా ఉండిపోయారని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రకటనను జస్టిస్ గవాయి తప్పుబట్టారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్/కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ఉద్దేశించి, గతంలో కవితపై వ్యాఖ్యలు చేసినప్పుడే రేవంత్ రెడ్డిపై తాము చర్యలు తీసుకుని ఉండి ఉంటే, ఇప్పుడిలా వ్యాఖ్యానించి ఉండేవాడు కాదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.