ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా DSC 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనతో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే వెంటనే విద్యాశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఈసారి DSC పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా (CBT) ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. దీనివల్ల నార్మలైజేషన్ విధానంను ఈ పరీక్షలో అమలు చేయనున్నారు.
ఏప్రిల్ 21న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, DSC పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు, రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలు జిల్లాల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, మండలాల్లో ఏర్పాటు చేస్తారు. అవసరమైతే పక్క రాష్ట్రాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. ఒక్కో షిఫ్ట్‌లో 300 నుంచి 500మంది వరకు పరీక్ష రాయగలుగుతారు. పరీక్షలు అనేక సెషన్లలో జరుగుతున్నందున అభ్యర్థులకు న్యాయం చేయడానికే నార్మలైజేషన్ విధానంను అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇది EAPCET, JEE పరీక్షల్లో వాడే విధానమే.
నార్మలైజేషన్ అంటే ఏమిటి?
సీబీటీ (CBT) విధానంలో ఒకే సబ్జెక్టు పరీక్ష 2 నుంచి 5 సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. కొన్ని సెషన్ల ప్రశ్నలు సులభంగా ఉండవచ్చు, మరికొన్ని కఠినంగా ఉండవచ్చు. ఈ పరిస్థితిలో అభ్యర్థులకు అసమానతలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. సులభమైన ప్రశ్నలు వచ్చినవారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉండగా, కఠినంగా వచ్చినవారికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి పరిష్కారంగా నార్మలైజేషన్ విధానంను వాడతారు. సులభంగా వచ్చిన పేపర్లకు కొన్ని మార్కులు తగ్గించి, కఠినంగా వచ్చిన పేపర్లకు కొన్ని మార్కులు జోడిస్తారు. ఇది సబ్జెక్ట్ నిపుణుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అయితే ఎవరికి ఎంత మార్కులు తగ్గుతాయో లేదా పెరుగుతాయో ఖచ్చితంగా ముందుగా చెప్పలేని కారణంగా అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.