పోలవరం డయాఫ్రమ్ వాల్ 202 మీటర్లు పూర్తి అయిందని మంత్రి నిమ్మల రమణాయుడు
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పనుల్లో ప్రగతి వివరాలను ఏపీ జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రమణాయుడు తెలిపారు. ఆయన వెల్లడించిన ప్రకారం, డయాఫ్రమ్ వాల్‌కి సంబంధించి ఇప్పటి వరకు 202 మీటర్ల నిర్మాణం పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గతంలో జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వేగంగా పూర్తి అవుతోందని అన్నారు.
నూతన నిర్మాణ పనుల ప్రారంభం
ప్రాజెక్టు పనులు జనవరి 18న రూ.990 కోట్లతో ప్రారంభించారు. రెండు కట్టర్లు మరియు రెండు గ్రాబర్లతో డయాఫ్రం వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. ఏప్రిల్ 30 నాటికి మూడవ కట్టర్ కూడా అందుబాటులోకి రానుందని చెప్పారు. వర్షాకాలంలో కూడా పనులు కొనసాగించాలని బట్రస్ డ్యామ్ పనులు మే నెలకల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి
డిసెంబర్ చివరి నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తిచేస్తామని, గ్యాప్-1 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఏప్రిల్లో ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. గ్యాప్-2 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు నవంబర్ 30 నాటికి మొదలవుతాయని, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. చంద్రబాబు సమీక్షలో 2027 గోదావరి పుష్కరాలు వరకు పనులు పూర్తి చేయాలని సూచించారని, కనీసం అప్పటికి పూర్తి చేయాలని అన్నారు.