AP ప్రభుత్వం నుంచి మెగా DSC 2025 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నాడు మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్నారు.
వివాహిత మహిళలకు ప్రత్యేక ప్రకటన
ఈ సారి వివాహిత మహిళల కోసం ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ప్రకారం, వివాహిత మహిళలు తమ సర్టిఫికెట్‌లో ఉన్న ఇంటి పేరుతోనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ అర్హతల మేరకు ఒకే దరఖాస్తులో అనేక పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే, ఒకే పోస్టుకు ఒక జిల్లాలో స్థానికులుగా, మరో జిల్లాలో స్థానికేతరులుగా దరఖాస్తు చేయడం అనుమతించబడదు.
దరఖాస్తుల గడువు, పరీక్షల తేదీలు
ఇప్పటికే 22,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈసారి 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని అంచనా. ఏప్రిల్ 20 నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మే 15 వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. మే 20 నుండి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుండి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుండి జూలై 6 వరకు పరీక్షలు జరుగుతాయి.