వినియోగదారులకు అలర్ట్: ఏప్రిల్ 1, 2025 నుంచి కీలక మార్పులు!
రూపే డెబిట్ సెలెక్ట్ కార్డ్‌లో కొత్త మార్పులు
ఏప్రిల్ 1, 2025 నుండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపే డెబిట్ సెలెక్ట్ కార్డ్ కు కీలక మార్పులు తీసుకురానుంది. ఈ కొత్త కార్డ్ ప్రయాణం, ఫిట్‌నెస్, వెల్నెస్ వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ మరియు ఇన్సూరెన్స్ కవరేజ్ వంటి ఫీచర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ మార్పులు చేయనున్నారు.
బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు
ఏప్రిల్ 1 నుంచి ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా అనేక బ్యాంకులు కనీస బ్యాలెన్స్ నిబంధనలను మార్చనున్నాయి. ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధించబడుతుంది. అదే విధంగా, ఏటీఎం ఉపసంహరణల నియమాలు కూడా మారనున్నాయి. ఇతర బ్యాంకుల ATMల నుంచి నెలకు కేవలం మూడు ఉచిత ఉపసంహరణలు మాత్రమే అనుమతిస్తారు. ఈ పరిమితిని మించి తీసుకున్న ప్రతీ లావాదేవీకి రూ.20 నుంచి రూ.25 వరకు అదనపు ఛార్జీలు విధించనున్నారు.
పాజిటివ్ పే సిస్టమ్ ద్వారా భద్రతా మెరుగుదల
లావాదేవీల భద్రతను పెంచేందుకు పాజిటివ్ పే సిస్టమ్ (PPS) ని అనేక బ్యాంకులు ప్రవేశపెడుతున్నాయి. రూ.5,000 కంటే ఎక్కువ మొత్తం చెక్కుల చెల్లింపులకు ఈ వ్యవస్థ ద్వారా ధృవీకరణ అవసరం. అకౌంట్ హోల్డర్లు ఈ కొత్త నిబంధనలను అర్థం చేసుకొని, ఏప్రిల్ 1, 2025 నాటికి తమ బ్యాంకింగ్ అలవాట్లను మార్చుకోవాలి.