జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు, ర్యాంకులు నేడు విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ కోర్సుల సీట్ల భర్తీ కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలు, తుది ర్యాంకులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. జనవరి నెలలో మొదటి సెషన్ జరగగా, ఏప్రిల్ 2 నుండి 9వ తేదీ వరకు రెండవ సెషన్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో BE/B.Tech (పేపర్-1) పరీక్షలు, ఏప్రిల్ 9న B.Arch / B.Planning (పేపర్-2A, 2B) పరీక్షలు జరిగాయి.
రెండు సెషన్లలో విద్యార్థి ఎక్కడ బెస్ట్ స్కోర్ సాధించాడో అదే స్కోర్‌ను పరిగణలోకి తీసుకొని తుది ర్యాంకులు కేటాయిస్తారు. ఇటీవల విడుదలైన ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల సమర్పణ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలు మరియు ర్యాంకులు కూడా నేడు విడుదల చేయనుంది. తుది ర్యాంక్ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
నిపుణుల అంచనాల ప్రకారం, కటాఫ్ మార్కులు ఇలా ఉండే అవకాశం ఉంది – జనరల్ కేటగిరీకి 93–95 శాతం, OBC/ EWSకి 91–93 శాతం, SCకి 82–86 శాతం, STకి 73–80 శాతం. తుది ఫలితాల్లో టాప్ స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు JEE అడ్వాన్స్‌డ్ 2025 రాయడానికి అర్హత లభిస్తుంది. మే 18న JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.