సీఎస్‌కే ఓటమితో శ్రుతి హాసన్ భావోద్వేగం
శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌ను హీరో అజిత్ కుమార్, హీరోయిన్ శ్రుతి హాసన్ సహా పలువురు కోలీవుడ్ స్టార్స్ ప్రత్యక్షంగా వీక్షించారు.
మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో శ్రుతి హాసన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్నేహితులతో కలిసి ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆటను ఆస్వాదించిన శ్రుతి, ధోనీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఫొటోలు తీస్తూ ఆనందించారు. కానీ మ్యాచ్ ఓడిపోవడంతో ఆమె కంటతడి పెట్టక తప్పలేదు.
సొంత మైదానంలో ఓటమి చెన్నై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా ముగిసినట్టే. మిగిలిన ఐదు మ్యాచుల్లో భారీ మార్జిన్‌తో గెలిస్తే తప్ప ముందుకు వెళ్లడం కష్టమే. ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే సాధించిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఎస్ఆర్‌హెచ్ ఈ విజయంతో తన స్థానం మెరుగుపరుచుకుంది.