అసెంబ్లీలో ఇవాళ ఎమ్మెల్యేలందరూ గ్రూప్ ఫొటో దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు. ఈ ఫొటో షూట్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. అసెంబ్లీ ఆవరణలో ఈరోజు ఎమ్మెల్యేలు అందరూ గ్రూప్ ఫొటో తీసుకోవడం జరిగిందని వెల్లడించారు.
ఇది ప్రజాస్వామ్య ప్రయాణానికి గుర్తుగా, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభివర్ణించారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రత్యేక ఫొటో సెషన్ లో పాల్గొన్నారని రఘురామకృష్ణరాజు వివరించారు. ఈ ఫొటోలో ప్రతిబింబించిన ఐక్యత, బాధ్యత, ప్రజలకు అందించే సేవల పట్ల నిబద్ధత మన ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేల గ్రూప్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అటు, ఎమ్మెల్సీలతోనూ చంద్రబాబు, పవన్, లోకేశ్ గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫొటోలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు.