ఐపీఎల్‌లో రెండు వరుస ఓటముల తర్వాత గెలుపు సాధించిన ముంబై ఇండియన్స్... ఆ ఊపును కొనసాగిస్తుందని అభిమానులు భావించారు. కానీ, లక్నో సూపర్ జెయింట్స్ ఎదురుదాడికి తాళలేక ముంబై మళ్లీ ఓడిపోయింది. లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో విజయాన్ని నమోదు చేసింది. ముంబై మాత్రం మూడో ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో కిందకు జారింది.
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ 67, నమన్ ధిర్ 46 పరుగులతో మెరిశినా, విజయం దక్కలేదు. హార్దిక్ పాండ్యా (28) మరియు తిలక్ వర్మ (25) కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్ మార్ష్ (60), మార్కరమ్ (53) అర్ధసెంచరీలతో రాణించారు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి జట్టుకు విశేష సహకారం అందించాడు. ఐపీఎల్ చరిత్రలో 5 వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు నమోదు చేశాడు. లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ రాఠీ (4 ఓవర్లు, 21 పరుగులు, 1 వికెట్)కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
నేడు ఐపీఎల్ డబుల్ హెడర్
ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ కేపిటల్స్ మధ్య కాగా, రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.