10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2025: మార్చి 21న ప్రారంభం – విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం, మార్చి 21, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు కనీసం ఒక గంట ముందుగా చేరుకోవాలని సూచించబడింది. ఆలస్యంగా వచ్చినా, 9:35 గంటల వరకు అనుమతిస్తారు.
ఈ పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. సైన్స్ సబ్జెక్టును ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్‌గా విడగొట్టారు, వీటికి ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,547 పాఠశాలల నుండి 5.09 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి 25 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
ప్రశ్నపత్రాల లీకేజీని నివారించేందుకు ఈసారి ప్రత్యేకంగా ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి లీక్ అయిందో గుర్తించవచ్చు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రశ్నపత్రాలను కెమెరాల ఎదుటే ఓపెన్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లరాదు. రవాణా సౌకర్యం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వేసవి వేడి కారణంగా విద్యార్థులు డీహైడ్రేషన్‌కి గురికాకుండా, పరీక్షా కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.