రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారతీయ సినిమా మరియు సమాజానికి చేసిన సేవలకుగాను పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ గౌరవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. బాలకృష్ణ ఈ వేడుకకు సంప్రదాయ పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
సినిమా రంగానికి చేసిన సేవలతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా సేవలు అందిస్తున్న బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. సినీ నటుడిగా ఆయన అందించిన విశేష సేవలు మరియు ప్రజల కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని ఈ పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేశారు.
దివంగత ముఖ్యమంత్రి, నటశేఖరుడు నందమూరి తారక రామారావు వారసుడిగా బాలకృష్ణ సినిమా రంగంలోకి వచ్చి 100కి పైగా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మాస్, యాక్షన్ చిత్రాలతో పాటు పౌరాణిక, చారిత్రక, సాంఘిక పాత్రల్లో కూడా తన నటనతో అలరించారు. గతంలో ఆయన ఫిలింఫేర్, నంది వంటి అనేక అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో పద్మభూషణ్ కూడా చేరింది.