తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ – రెడ్, ఆరెంజ్ అలెర్ట్స్ జారీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేసవి భానుడు తన తీవ్రతను పెంచుతున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయడం భయాందోళన కలిగిస్తోంది. సాధారణంగా మేలో వచ్చే ఎండలు ఈసారి ఏప్రిల్‌లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9 లేదా 10 గంటలకే వేడి భరించలేని స్థాయికి చేరుతోంది.
తెలంగాణలో ఆదిలాబాద్ (44.3°C), నిజామాబాద్ (44°C), మెదక్ (42.8°C), రామగుండం (42.3°C), మహబూబ్‌నగర్ (41.2°C), ఖమ్మం (41°C), హనుమకొండ (40.5°C) ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 33 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి ఉన్నాయి. ఇక 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా ప్రకటించారు.
ఏపీలోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇప్పటి సమ్మర్‌లో అత్యధికం. ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 43.8, కడప జిల్లా మద్దూరులో 43.6, కర్నూల్‌లో 42.9, పల్నాడు జిల్లాలో నర్మలపాడులో 42.8, నెల్లూరులో ఉదయగిరిలో 42.5 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. మొత్తం ఏపీ వ్యాప్తంగా 135 ప్రాంతాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వేడి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందరు జాగ్రత్తగా ఉండాలి.