సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న మోహన్ లాల్ 'తుడరుమ్'
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘తుడరుమ్’ ఈ నెల 25న విడుదల అయింది. ఎటువంటి ప్రమోషన్లు లేకుండా విడుదలైనప్పటికీ, ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అన్ని భాషల ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.
గత నెల 27న విడుదలైన ‘ఎంపురాన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్లు నమోదు చేసి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఆ విజయం తర్వాత నెలలోనే మోహన్ లాల్ మరో సినిమా అయిన తుడరుమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శోభన కథానాయికగా నటించారు. మొదటి షో నుంచే మంచి టాక్ రావడంతో టికెట్ల అమ్మకాలు బాగా పెరిగాయి. విడుదలకు రెండు రోజుల ముందు ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. బుక్ మై షో లాంటి ప్లాట్‌ఫార్మ్‌లలో గంటకు 35,000 టికెట్లు అమ్ముడయ్యాయి, ఇది 'ఎంపురాన్' కంటే ఎక్కువగా ఉంది. మలయాళంతో పాటు తెలుగు భాషలో కూడా విడుదలైన ఈ సినిమా, ప్రమోషన్లు లేకున్నా మంచి కలెక్షన్లు రాబడుతోంది. గత శుక్రవారం తెలుగులో వచ్చిన పది సినిమాల్లో ‘తుడరుమ్’ మాత్రమే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని హౌస్‌ఫుల్ షోలు అందుకుంది. మోహన్ లాల్ నటన, శోభన అభినయం, దృశ్యం తరహా కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కేరళలో ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో కొనసాగుతోంది.