వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు: మూడేళ్ల తర్వాత మేమే గెలుస్తాం
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు తమవేనని ధీమాగా తెలిపారు. "కళ్లు మూసుకుంటే మూడు సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత అఖండ మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలుస్తుంది" అని అన్నారు. జగన్ 1.0 పాలనకు భిన్నంగా "జగన్ 2.0" మరింత బలంగా ఉంటుందని చెప్పారు.
కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా
ఈసారి పార్టీ కార్యకర్తల కోసం మరింత గట్టిగా నిలబడతానని జగన్ హామీ ఇచ్చారు. "మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని పాలించేది మేమే" అని ధీమా వ్యక్తం చేశారు. తాను చంద్రబాబును బలమైన రాజకీయ ప్రత్యర్థిగా చూడడం లేదని, "అయనలో ఎటువంటి మార్పు లేదు" అని విమర్శించారు.
ఉపఎన్నికల విజయం - కార్యకర్తలకు అభినందనలు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో ధైర్యంగా పోరాడి పార్టీకి విజయాన్ని అందించిన ప్రజాప్రతినిధులను జగన్ అభినందించారు. పార్టీకి కష్టకాలంలో అహర్నిశలు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ రుణపడి ఉంటుందని తెలిపారు.
"చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయి"
చంద్రబాబు నాయుడు మోసాలు తుదిదశకు చేరుకున్నాయని జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న P4 విధానం పై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. "సూపర్ సిక్స్, సూపర్ సెవన్ ఎగవేయడానికి అప్పులపై అబద్ధాలు చెబుతున్నారు" అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
"ప్రలోభాలతో గెలవాలని చూసారు"
చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయని జగన్ ఆరోపించారు. "స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో తక్కువ సంఖ్యాబలం ఉన్నా పోటీ చేసి, మా నేతలను ప్రలోభాలకు గురిచేయాలని చూశారు" అని అన్నారు. అలాగే "కూటమి నేతలు పోలీసుల సహాయంతో ఎన్నికల్లో గెలవాలని చూశారు" అని విమర్శించారు.