హైదరాబాద్, మార్చి 9: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ కృష్ణా రావు సూచించారు. అలాగే, విద్యార్థులు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుండి కూడా హాల్ టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి కారణాలతో హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరించినా, విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసి పరీక్షలు రాయవచ్చని తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా సందేహాలుంటే, 040-23230942 ఫోన్ నంబరుకు ఫోన్ చేసి అడగవచ్చు. ఈ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,544 పాఠశాలలు ఉండగా, ఈ పాఠశాలల్లో సుమారు 4.97 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలు ఉంటాయని, కంగారు పడాల్సిన అవసరం లేదని కృష్ణా రావు చెప్పారు. ఈ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు.