శ్రీరాముని స్ఫూర్తితో పాలన సాగిస్తా: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉభయదంపతులతో కలిసి కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీరాముని స్ఫూర్తితో రాష్ట్రాన్ని పాలిస్తానని, ప్రజలందరికీ సుఖసంతోషాలను అందించేలా రామరాజ్యాన్ని నెలకొల్పుతానని తెలిపారు.
ముఖ్యమంత్రి దంపతులు ప్రభుత్వ తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, శ్రీరాముల కల్యాణం ఎంతో వైభవంగా జరిగిందని, శ్రీరాముని పాలన ప్రజలందరికీ ఆదర్శమని చెప్పారు.
ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలోకి తీసుకున్నామని, టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయాలని తన ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆలయం చుట్టుపక్కల సుందరీకరణ జరుగుతోందని, భక్తులు రెండు మూడు రోజులు ఉండేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు మాట్లాడుతూ, తన దృష్టిలో రామరాజ్యం అంటే పేదరికం లేని, సమృద్ధిగా ఉన్న స్వర్ణాంధ్రప్రదేశ్. ప్రజల సహకారంతో ఆర్థిక అసమానతలు తొలగించి, అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.