విధాత: అంగారకుని (Mars) పై ఉన్న వింతలు విశేషాలను తెలుసుకునేందుకు పలు దేశాల అంతరిక్ష సంస్థలు అక్కడకు ఉపగ్రహాలను పంపిన విషయం తెలిసిందే. మన ఇస్రో మంగళ్‌యాన్‌ను ప్రయోగించగా.. నాసా పర్సెవరెన్స్ రోవర్‌ను, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మార్స్ ఎక్స్‌ప్రెస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించాయి. మార్స్ ఎక్స్‌ప్రెస్ (Mars Express) 2003లో అంగారకుని కక్ష్యలో ప్రవేశించగా.. అప్పటి నుంచి దాని చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. ఈ క్రమంలో అది కొన్ని లక్షల మార్స్ ఫొటోలను తీసి శాస్త్రవేత్తలకు పంపింది. వాటన్నింటినీ క్రోడీకరించిన శాస్త్రవేత్తలు తాజాగా అంగారకుడిపై ఉన్న ఒక వింత ప్రదేశాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. నోక్టిస్ లాంబ్రింథస్ లేదా లాబిరింథ్ ఆఫ్ నైట్ అని పిలిచే ఈ ప్రాంతం.. మార్స్ లో గ్రాండ్ కానియన్ అని భావించే మార్షియన్ వేల్స్ మెరైనరీస్ ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఇది మన సౌర ప్రపంచంలోనే అతి పెద్ద అగ్ని పర్వతం కావడం విశేషం. ఆ అగ్ని పర్వతం నుంచి ఎగజిమ్మిన లావా ముందుకు ప్రవాహంలా సాగినపుడు ఆ ప్రాంతం అంతా ఒక గొయ్యిలా మారిపోయింది. లావా ప్రవహించని మార్గం ఎత్తుగా ఉండిపోయింది. ఈఎస్ఏ (European Space Agency) వీడియోలో కనిపించిన గుట్టల్లాంటి ప్రాంతాలు అసలైన అంగారక ఉపరితలం. వాటి మధ్య లోయలు లావా ప్రయాణించిన ప్రాంతం. ఈ ప్రక్రియలో పెద్ద పెద్ద కొండల మధ్య చిన్ని చిన్ని దారులు ఏర్పడి.. ఆ ప్రాంతం ఒక పెయింటింగ్‌లా కనిపిస్తోంది.