హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సహకారంతో, నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్ మరియు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఈ నోటిఫికేషన్‌ను మార్చి 6న విడుదల చేశారు.
ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ ప్రకటనలో, మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని తెలిపారు. జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్ పరీక్షను నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా మే 3వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ జూన్ 21న విడుదల చేస్తారు, దీనిపై అభ్యంతరాలను జూన్ 22 నుంచి 26 వరకు స్వీకరిస్తారు. ఫైనల్ కీ విడుదల చేసిన అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.
ఈసారి ఐసెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం నాలుగు షిఫ్టుల్లో, రెండు రోజులపాటు పరీక్ష జరుగుతుంది. ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.