తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కల్పించింది. ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లిస్తే, వడ్డీపై 90% రాయితీ కల్పించేలా వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు.
దాన కిషోర్ మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు OTS పథకాన్ని వినియోగించుకుని తమ ఆస్తి పన్నును సకాలంలో చెల్లించుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడానికి ప్రభుత్వం ఈ తరహా పథకాలను అమలు చేస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, పూర్తి పన్నుతోపాటు కేవలం 10% వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతేడాది ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకం ద్వారా సుమారు 1 లక్ష మంది ఆస్తి పన్ను చెల్లించినట్లు GHMC వెల్లడించింది. ఈసారి కూడా రూ. 2,000 కోట్లు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఓటీఎస్ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున, తగిన స్థాయిలో ఆదాయం సమకూరుతుందని GHMC భావిస్తోంది.
ఈ సదవకాశాన్ని హైదరాబాద్ వాసులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ కోరారు.