హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగనున్నాయి. ఈ పరీక్షల హాల్‌టికెట్లు ఈరోజు (మార్చి 7) విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ (www.bse.telangana.gov.in) ద్వారా విద్యార్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ. కృష్ణారావు ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు హాల్‌టికెట్లు పంపిస్తామని తెలిపారు. ఏదైనా కారణాలతో పాఠశాల యాజమాన్యం హాల్‌టికెట్లు ఇవ్వనట్లయితే, విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు.
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11,544 పాఠశాలల నుంచి 4.97 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. 2,500 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. విద్యార్థులు తమ పాఠశాలలకు సమీపంలోని పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు రాయనుండడంతో కంగారు పడాల్సిన అవసరం లేదని కృష్ణారావు తెలిపారు.
గతంలో మాదిరిగానే, ఈసారి కూడా పదో తరగతి పరీక్షలు 80 శాతం మార్కులకు మాత్రమే నిర్వహించనున్నారు, మిగతా 20% ఇంటర్నల్ మార్కులుగా కేటాయించనున్నారు. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుండి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేసి, మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
అలాగే, ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు గ్రేడ్స్ స్థానంలో మార్కుల రూపంలో ప్రకటించనున్నారు, ఈ మేరకు విద్యాశాఖ ఇటీవల జీవో విడుదల చేసింది.