శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి (ఫిబ్రవరి 19, బుధవారం) నుండి ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజులపాటు కొనసాగనున్నాయి. ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయ ప్రాంగణం రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబై భక్తుల్ని ఆకర్షిస్తోంది.
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. కొందరు నల్లమల కొండలు దాటి పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వసతి, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడమేకాకుండా, ప్రత్యేక దర్శన క్యూలైన్లను సిద్ధం చేశారు. పాదయాత్ర భక్తుల కోసం ప్రత్యేక షెడ్లు, మట్టి రోడ్ల మరమ్మతులు కూడా చేశారు. ఈ ఏడాది భక్తులకు 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఉచితంగా లడ్డూలను అందజేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
ఈ బ్రహ్మోత్సవాలకు సుమారు 8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. వివిధ వాహన సేవలు, రథోత్సవం, తెప్పోత్సవం వంటి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా, మహాశివరాత్రి రోజు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించబడతాయి. భక్తుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 39 ఎకరాలలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి, ఉచిత బస్సుల ద్వారా ఆలయానికి చేరుకునే సౌకర్యాన్ని కల్పించారు.