JEE మెయిన్ 2025 పేపర్ 2 టాపర్: జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థి ఫస్ట్ ర్యాంక్
జేఈఈ మెయిన్ పేపర్ 2లో ఏపీ విద్యార్థి అగ్రస్థానంలో
జనవరి 30న నిర్వహించిన జేఈఈ మెయిన్ 2025 పేపర్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ సాయి హిమినేష్ 99.53 పర్సంటైల్ స్కోర్ చేసి పీడబ్ల్యూబీడీ కేటగిరీలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. రోజుకు 12 గంటలకుపైగా కష్టపడి చదవడం వల్లే ఈ ఫలితం సాధించానని హిమినేష్ ఆనందం వ్యక్తం చేశాడు.
బీఆర్క్ & బీ ప్లానింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన JEE Main Paper 2 ఫలితాలు ప్రకటించారు. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత 22వ తేదీన తుది కీ విడుదలైంది. అనంతరం ఫలితాల్లో తూర్పు గోదావరి, రాజమహేంద్రవరంకు చెందిన శ్రీ సాయి హిమినేష్ పీడబ్ల్యూబీడీ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచాడు.
కష్టమే విజయానికి మార్గం
శ్రీ సాయి హిమినేష్ తన విజయం తండ్రి కష్టానికి అంకితం చేశాడు. చిన్న వ్యాపారం చేస్తున్న తండ్రి తన ఇద్దరు పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచే అన్నదమ్ములు తరగతుల్లో ప్రథమ స్థానాలు సాధించారని చెప్పాడు. ఐఐటీలో చదివి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయడం తన లక్ష్యం అని హిమినేష్ చెప్పాడు.