s Nari Shakti - Empowering Women

బహుముఖప్రజ్ఞతో రాణిస్తున్న రాధిక మంగిపూడి - శ్రీమతి మంగిపూడి రాధిక | Nari Shakti - Empowering Women | Mana Voice

శ్రీమతి మంగిపూడి రాధిక

శ్రీమతి మంగిపూడి రాధిక, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వక్త, వ్యాఖ్యాత, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల రూపకర్త,  సంఘసేవకురాలు, “శ్రీ సాంస్కృతిక కళాసారథి“ సింగపూర్ ప్రధానకార్యనిర్వాహక వర్గ సభ్యురాలు మరియు “గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం” సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు

బాల్యం & విద్య
2020 వరకు సింగపూర్ లో నివసించిన శ్రీమతి రాధిక ప్రస్తుత నివాసం ముంబై. స్వస్థలం విద్యల నగరం విజయనగరం. బొబ్బిలి ఆస్థాన కవిపండితులైన కొటికలపూడి వారి వంశంలో జన్మించిన ఆమెకు చిన్ననాటి నుండి సాహిత్యాభిలాష అలవడింది. ఆమె తండ్రి కొటికలపూడి కూర్మనాధంగారు 18 పుస్తకాలను ప్రచురించిన ప్రముఖ కవి, గేయ రచయిత మరియు మహారాజా కళాశాల ఆంగ్ల అధ్యాపకులు. తల్లి శ్రీమతి మంగతాయారు గారు రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు.
శ్రీమతి రాధిక ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తితో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి శంకరాద్వైతం ప్రత్యేక పాఠ్యాంశంగా  తత్త్వశాస్త్రంలో 2002లో యమ్.ఏ పట్టా అందుకున్నారు.  ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర విభాగంలోనే పీహెచ్డీ పరిశోధన చేస్తున్నారు. 

సాహిత్య రంగం 
శ్రీమతి రాధిక కవితలు, కధలు, ఛందోబద్ధ పద్యాలు, కధనాలు, వ్యాసాలు, పాటలు, హాస్యరచనలు, లఘు చిత్ర సంభాషణలు వ్రాయడం ద్వారా అనేకమంది ప్రముఖుల ప్రశంసలు అందుకొని, సాహితీలోకంలో బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. 2016లో సింగపూర్ లో జరిగిన '5వ ప్రపంచ సాహితీ సదస్సు'లో వక్తగా పత్ర సమర్పణ చేయడంతో ఆమె సాహితీ ప్రస్థానం మొదలైంది. ఆనాటినుండి అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిర్వహించిన జాతీయ అంతర్జాతీయ సదస్సులలో వక్తగా, అతిథిగా పాల్గొని సాహితీప్రియుల ప్రశంసలందుకున్నారు. వివిధ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన కవిసమ్మేళనాలలో కూడా పాల్గొన్నారు. ఎన్నో అవధానాలలో ప్రముఖ సాహితీవేత్తల సరసన పృచ్ఛకురాలిగా పాల్గొన్నారు. ప్రఖ్యాత "తానా" సంస్థతో సహా వివిధ దేశాల ప్రవాస తెలుగు సంస్థల కార్యక్రమాలలో పాల్గొనడం, వారితో కలిసి పనిచేయడం ద్వారా ఆమె అందరికీ మరింత సుపరిచితురాలయ్యారు.  “5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు” వేదిక ప్రారంభ సభకు ఆత్మీయ అతిథిగా ఆహ్వానించబడ్డారు. వీరి కవితలు, కథలు వివిధ పత్రికలలో మరియు అంతర్జాతీయ పుస్తకసంకలనాలలో ప్రచురింపబడ్డాయి. సింగపూర్ నుంచి ప్రసారమయ్యే 'రేడియో చెట్నీ' తెలుగు కార్యక్రమాలకు ప్రధాన సమన్వయకర్తగా సేవలు అందించారు. పలు పత్రికలలో, పలు చానల్స్ లో ఆమె ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి.

రచనలు
1. 2019లో "భావ తరంగాలు" పేరుతో ఆమె వ్రాసిన తొలి కవితా సంపుటి ప్రచురితం అయ్యి విజయనగరంలో ఆవిష్కరించబడింది.
2. 2020లో  "అలా సింగపురంలో" అనే కథా సంపుటి “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” వారిచే ప్రచురింపబడి, ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. ఇది సింగపూర్ నుంచి వెలువడిన తొలి కథల పుస్తకం
3. 2021లో “తటవర్తి గురుకులం” ఆస్ట్రేలియా ప్రచురణలో, ప్రాచీన భారతీయ తత్వశాస్త్ర సారాన్ని ఆటవెలది పద్యాల రూపంలో రచించి “భారతీయ తత్త్వ శతకము” అనే పుస్తకంగా ప్రచురించారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ముందుమాట అందించగా, పంచమహాసహస్రావధాని మేడసాని మోహన్ గారు దీన్ని ఆవిష్కరించారు
4. 2022లో “వంశీ ఆర్ట్ థియేటర్స్” స్వర్ణోత్సవ ప్రచురణగా “నవ కవితా కదంబం” కవితా సంపుటి గౌ. వెంకయ్య నాయుడు గారిచే రవీంద్ర భారతిలో ఆవిష్కరింపబడింది
5. 2022లో “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” ప్రచురణగా “మరో మాయాబజార్” కథా సంపుటి ప్రముఖ కవి జొన్నవిత్తుల గారి చేతుల మీదుగా న్యూజిలాండ్ లో ఆవిష్కరించింది. 

పురస్కారాలు & సత్కారాలు
1. సింగపూర్ లో నివసించే తెలుగు రచయితలలో తొలి కథా సంకలనాన్ని వెలువరించిన రచయిత్రిగా "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" లో స్థానం సంపాదించుకున్నారు.
2. 2019లో "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" వారు నిర్వహించిన ఉగాది కథల పోటీ ప్రథమ బహుమతి నగదు పురస్కారం అందుకున్నారు.
3. 2020లో సింగపూర్లో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, NRI కల్చరల్ సొసైటీ & PRAD సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "ఉమెన్ ఎక్సలెన్సీ పురస్కారం" అందుకున్నారు.
4. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా "దక్షిణాఫ్రికా తెలుగు సంఘం" & "వీధి అరుగు" నార్వే సంయుక్త ఆధ్వర్యంలో “అంతర్జాతీయ ప్రవాస తెలుగు పురస్కారం – 2021” అందుకున్నారు.
5. వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా “స్వర్ణ వంశీ శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారం 2022” అందుకున్నారు. 
6. రక్షా ఇంటర్నేషనల్ పౌండేషన్ వారి “మాతృశ్రీ ఊటుకూరు రత్నసుందరి అంతర్జాతీయ సాహితీ పురస్కారం- 2022” అందుకున్నారు.
7. శ్రీమతి వాసా ప్రభావతి గారి పేరున “వంశీ ఉగాది  సాహితీ పురస్కారం -2023” హైదరాబాద్ లో అందుకున్నారు 
7. ముంబై లో తెలుగు కళా సమితి వారి “సంక్రాతి ప్రతిభా పురస్కారం -2023” అందుకున్నారు. 
8. సింగపూర్ లో  శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, సంగీత దర్శకులు మాధవ పెద్ది సురేష్ గారు మరియు విశ్రాంత  డిజీపి  కరణం అరవింద్ రావు గారి చేతుల మీదుగా వివిధ సభలలో సన్మానింపబడ్డారు. 
9. విజయవాడలో “ప్రపంచ రచయితల సంఘం” సత్కారం, హైదరాబాదులో భారత పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారిచే సత్కారం, తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ వారి మాతృ దినోత్సవ సత్కారం,  విజయనగరంలో “రోటరీ క్లబ్ ఒకేషనల్ సర్వీస్ అవార్డు” "కౌముదీ పరిషత్తు" సత్కారం, "మహారాజా సంస్కృత కళాశాల" సత్కారం, సింగపూర్ లో "తెలుగు భాగవత ప్రచార సమితి" సత్కారం  మొదలగు ఎన్నో గౌరవ సత్కారాలను అందుకున్నారు. 

వ్యాఖ్యాతగా & నిర్వాహకురాలిగా
సీనియర్ నటీమణి డాక్టర్ జమున రమణారావు గారిని సాక్షి టీవీ కొరకు ఇంటర్వ్యూ చేశారు.  ప్రముఖ సినీ రచయిత శ్రీ భువన చంద్ర గారితో, మండలి బుద్ధ ప్రసాద్ గారితో పద్మశ్రీ శోభారాజు గారితో తదితర ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాలను  నిర్వహించారు. ABN , Bharat Today వంటి చానల్లో చర్చా కార్యక్రమాలలో అతిథిగా పాల్గొన్నారు
"శ్రీ సాంస్కృతిక కళాసారధి", సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలిగా  అనేక అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రణాళికా రచన మరియు నిర్వహణలో తన సేవలందిస్తున్నారు. దాదాపు 80 అంతర్జాతీయ కార్యక్రమాలకు  వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రపంచవ్యాప్త గుర్తింపు సాధించి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ‘7వ & 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుల' కార్యనిర్వాహక వర్గ సభ్యురాలిగా కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. మరియు సదస్సు”సభా విశేష సంచిక” సహ సంపాదకులుగా సేవలందించారు. ఘంటసాల గారి శతజయంతి సందర్భంగా నిర్వహించిన 366 రోజుల “ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా సేవలందించారు. 

సాంఘిక & సేవా రంగం 
సాహాతీ రంగంలోనే కాక సాంఘిక సేవా రంగంలో కూడా "ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం"  ఫేస్బుక్ గ్రూపు ద్వారా 40 వేల మంది సభ్యులను ఒక వేదిక మీదకు చేర్చి విజయనగర వైభవ ఖ్యాతిని జగద్విదితం చేస్తున్నారు. దాని అనుబంధ సంస్థ  అయిన "GHV ఛారిటబుల్ ఫౌండేషన్" సంస్థను స్థాపించి గత 7 సంవత్సరాలుగా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వంశీ ఇంటర్నేషనల్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్, జనరంజని ముంబై, ముంబై తెలుగు సమితి, వీధి అరుగు నార్వే, నవ సాహితీ చెన్నై, అక్షరయాన్, మహారాష్ట్ర రచయితల సంఘం, మొదలైన సంస్థలలో గౌరవ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens