నా అడుగు గమ్యం వైపు సాగుతూనే ఉంటుంది - Smt. Radhika andra | Nari Shakti - Empowering Women | Mana Voice

నా పేరు రాధిక ఆండ్ర . ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం లో జన్మించాను . నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులు , అమ్మ సాధారణ గృహిణి . అన్నదమ్ములు లేరు . చిన్ననాటినుండి మా నాన్నగారి వేలు పట్టుకుని బడికి వెళ్లి ,ఆయనదగ్గరే విద్యా బుద్ధులు నేర్చుకున్నాను . నా ప్రాధమిక విద్య ఆసాంతం మా నాన్నగారి సారధ్యమే .

స్వతహాగా పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్న మా నాన్నగారు వివిధ రకాల పుస్తకాలతో మా ఇల్లు నింపేసేవారు . ఆయన జిజ్ఞాసని బాల్యం నుండే నాకూ అలవర్చారు . నాకు 5 ఏళ్ళ వయసునుండే తెలుగు పుస్తకాలు చదవడం అలవాటు . ఆ వయసు లో మహాభారత ,రామాయణాలు ,పంచతంత్ర కథలు ..ఇతిహాసాలు కథలుగా చెప్పటమే కాకుండా నాచే చదివించేవారు . అదిగో అప్పుడే నాకు చదవడం ఒక వ్యాపకమైంది . ఎన్ని పుస్తకాలు చదివానో లెక్కలేదు ..ప్రతీ పుస్తకం ఏదో ఒకటి నేర్పింది . నాకు తెలియకుండానే రచన పై పట్టు పెరిగింది . ఈ కథ ఇలా ఉంటె బావుండేది ..అలా ఉంటె బావుండేది ..అన్న ఆలోచనలు పెరిగాయి . చిన్నతనంలోనే కథల్ని రాయటానికి నన్ను ప్రేరేపించాయి .

కానీ ..చదువు పెరిగేకొద్దీ పాఠ్య పుస్తకాలకి దగ్గరై సాహిత్యానికి దూరమై పోయాను . విశాఖలో ఫిజిక్స్ లో పీ జి చేస్తున్నప్పుడు హాస్టల్ లో ఉండేదాన్ని . అప్పుడే కాస్త ఖాళీసమయం దొరికితే ఒక కథ రాయటం మొదలుపెట్టాను ..నోటు పుస్తకాల్లో నా రచనా గమనం మొదలైంది . రాసాక అందర్నీ చదివి ఎలా ఉందో చెప్పమనే దాన్ని . శ్రద్ధ ఉన్నవారు చదివి బావుందని చెప్పేవారు ..మరికొంతమంది చదవకుండానే ఏదో ఒకటి చెప్పేసేవారు . కానీ నాలో రచయితగా ఎదగాలన్న కోరిక అప్పుడే బలపడింది . కానీ నా రచనల్ని అందరికి చేరువయ్యేలా ఎలా చేయాలో నాకు తెలియలేదు ..మ్యాగజిన్ లకి పంపే మార్గం కూడా నాకు తెలీదు .అప్పట్లో ఇంటర్నెట్ ,ఫోన్ అంతగా సదుపాయాలు ఉండేవి కావు .ఆండ్రాయిడ్ ఫోన్ కూడా చూడనే లేదు . 

పీజీ పూర్తయ్యాక ఒక సంస్థలో ఉద్యోగం చేశాను ..సమయమంతా ప్రయాణం లోనూ ఇష్టం లేని ఆ ఉద్యోగం లోనూ గడచి పోయి ఏదో అడవి కాచిన వెన్నెలలా నాలో కళ అడుగంటినట్టని పించింది .నాలో సాహిత్యపు అలలు ఎగసి ఆకాశాన్ని అందుకోలేక కడలిలో కలసిపోతున్నట్టని పించింది . 4 ఏళ్ళు వైజాగ్ లో ఉద్యోగం చేసాక 2010 లో నా వివాహం శ్రీనివాస సుబ్బరాజు గారితో జరిగింది . మాది ప్రేమవివాహం ..ఆయనకి బెంగుళూరు లో సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి అక్కడే జీవితాన్ని ఆరంభించాము . కొన్నాళ్లు జాబ్ చేయకూడదని అనుకున్నా కాబట్టి ఆయన ఆఫీస్ కి వెళ్ళాక నాకు సమయం ఉండేది ..అప్పుడే ఇంకో నవల రాయటం మొదలు పెట్టాను . కానీ అప్పుడే నాకు ఓ సందేహం వచ్చింది . నేనెంత రాసుకున్నా అవి నా వరకే పరిమితమవుతున్నాయి ..నా కథలు పదిమంది చదవాలి ..అదెలా ? అని .

అప్పుడే కాస్త ఫోన్స్ ,ఇంటర్నెట్ సౌకర్యాలు సమకూరుతున్న రోజులు కాబట్టి ఆన్లైన్ లో ఏవైనా పబ్లిషర్స్ ఉన్నారా అని వెతికే క్రమంలో నాకు ఓ ఉపాయం తోచింది . అప్పుడే బ్లాగ్ మొదలుపెట్టి అందులో తొలిసారిగా ఒక నవల రాయటం మొదలు పెట్టాను . తొలిసారిగా ఆన్లైన్ లో పబ్లిష్ అయిన నా తొలి నవల "రుధిర సౌధం " . బ్లాగ్ ఐ డి, తెలిసిన వాళ్ళకి పంపి చదవమని చెప్పేదాన్ని . పేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఏదో కాస్త ప్రచారం చేసుకున్నా . ఏదో కొంత ఆదరణ మాత్రమే లభించింది . ఆ తరువాత" కూడలి " అని ఒక బ్లాగ్ ల సమాహారం నాకు ఆన్లైన్ లో కనబడింది . ఇక నా బ్లాగ్ ని అందులో పెట్టాను . అలా " నా రచన .కం " అనే వెబ్ ఆధారిత లింక్ ద్వారా నా రచనలు ప్రపంచానికి చేరువయ్యాయి . బ్లాగ్ లో నేను రాసిన నవల ఇండియా కంటే బయట ఉన్న 40 దేశాల్లో ఉన్న తెలుగువారి మన్ననలని పొందింది . దాంతో నా ఆకాంక్ష కొంతవరకు నెరవేరింది . ఈలోపు జీవితంలో ఒడిదుడుకులు , కష్టాలు ,కన్నీళ్లు నన్నూ పలకరించకుండా పోలేదు ..అవి నన్ను మరింత స్థిరంగా నిలబెట్టాయి ..సాహిత్యం నా ఆత్మాభిమాన్ని ,ఆత్మబలాన్ని పెంచిందని భావిస్తాను . అందరిలాగే నా జీవితమూ కష్ట సుఖాల నడుమే సాగింది . మొదటి సంతానాన్ని కోల్పోయాను ..అవమానాలు మనసులో దాచేసాను ..ముందుకి నడవటానికి ఆత్మస్థైర్యాన్ని కూడగొట్టుకున్నాను ..అప్పుడే మరోసారి సంతాన భాగ్యం నన్ను వరించింది . ఒకసారి పోగొట్టుకున్నదాన్ని కదా ..ఆచితూచి అడుగులేస్తూ నా బిడ్డని ఈ లోకం లోకి ఆహ్వానించాను . తదుపరి వాడే లోకంగా , వాడి ఆలనాపాలనా , నా బాధ్యత లతో రచనకి 5 ఏళ్ళు దూరమై పోయాను . నా కనుకొలకుల్లో కరిగిపోని కలగా నా రచనా జీవితం ముగిసిపోయిందని అనుకున్నాను . ఈలోపు నా బ్లాగ్ హాక్ చేయబడింది . చాలా డేటా పోయింది . ఇక కుదరదులే అనుకున్నా ..కుటుంబానికే సమయం ఇచ్చాను ..అనారోగ్యాలు ,బాధలు , బాధ్యతలు వేరే ఆలోచన లేకుండా చేసేశాయి . కానీ ఏదో మూల నాలో ఉద్భవించే కథలు నా కలల్ని ..నాలో కళని తట్టిలేపాయి . బలవంతంగా దాన్ని అణిచేస్తున్నంతలోనే మా బాబుకి 5 ఏళ్ళు వచ్చేసాయి . 

ఓరోజు అప్రయత్నంగా ఫోన్ లో నాకు "కూ" యాప్ కనబడింది . అది ఇండియన్ ట్విట్టర్ అని అర్థమైంది . సరదాగా ఓ అకౌంట్ ఓపెన్ చేశాను ..కానీ అందులో ఏ విధమైన పోస్ట్ లు పెట్టాలో అర్థం కాలేదు . సరే ..కవితలు రాద్దాం ..మహా అయితే ఐదు నిముషాలు ..నేను సమయం ఎక్కువగా ఇవ్వక్కరలేదు ..అనుకుని అందరూ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజెస్ పెడుతూఉంటే నేను మాత్రం సూర్యోదయం పై ఓ కవితతో అందర్నీ పలకరించాను . అలా ప్రతిరోజు ఓ సూర్యోదయ కవిత పెట్టడం అలవాటు అయింది . అక్కడే నా రచనా జీవితం కొత్త మలుపు తిరిగిందని నాకు అర్థం కావడానికి సమయం పట్టింది . "కూ" లో పాఠకులు నన్నెంతలా ఆదరించారు అంటే ..ఏ రోజు కవిత ఆలస్యమయిన నాకు మెసేజ్ వచ్చేసేది . అశేష పాఠకులు అనుచరులుగా ప్రోత్సహించారు ..ప్రశంసించారు ..1500 పైగా అందులో నేను కవితలు వ్రాసాను . " సరస్వతి పుత్రిక " అని తోటి సాహితీ వేత్తల ప్రశంసలు అందుకున్నాను . అప్పుడే చాలా మంది దృష్టి కి వచ్చాను ..నన్ను ప్రోత్సహించిన వారిలో "మన వాయిస్ అశోక్ గారు " కూడా ఒకరు . మరొక ప్రఖ్యాత ఛానల్ వారు నా కవితలు బుక్ గా ప్రింట్ చేస్తానని మెయిల్స్ పెట్టి పెట్టి ఆఖరికి నమ్మి వందల్లో కవితలనిస్తే తరువాత అయిపు లేకుండా మోసం చేసిన వారూ ఉన్నారు . కవితా చౌర్యం కూడా జరుగుతుంది అని అప్పుడు తెలిసి నవ్వుకున్నాను ..ఏ ఒక్కరూ నాలో కళని దోచుకుపోలేరు గా ..నేను ఏ పోటీలకు కవితల్ని ,కథల్ని పంపలేదు ..అంత సమయం కేటాయించలేక పోయాను . 

అప్పుడే ప్రతిలిపి నన్ను ఆకర్షించింది . ప్రతిలిపి బెంగళూరు లో రచయితలకోసమే మొదలు పెట్టిన ఒక సంస్థ . ఈ సంస్థ మొదలైన తొలినాళ్లలోనే అందులో జాయిన్ అయ్యాను కానీ ..అందులో తెలుగు టైపింగ్ సాఫ్ట్వేర్ అంత బావుండేది కాదు ..ఆ తరువాత సమయం కూడా దొరకక లెఫ్ట్ అయిపోయాను . కానీ గత సంవత్సరం కరోనా వల్ల సాఫ్ట్వేర్ వాళ్ళకి వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ దొరికాక ఆంధ్ర వచ్చాము . బాబు కూడా కాస్త పెద్దవాడు అవ్వటం మూలాన ..మళ్ళి నా రచనా జీవితాన్ని మరో మలుపు తిప్పాలని అనుకున్నాను . ప్రతిలిపిలో నియమాలేవి పెద్దగా తెలుసుకోకుండానే నాకెంతో పేరు తెచ్చిన " రుధిర సౌధం " సీరియల్ ని అందులో పోస్ట్ చేశాను . లక్ష పైచిలుకు పాఠకులతో నా రచనల్లో ఇప్పటికి ఆ సీరియల్ ముందంజ లోనే ఉంది . అప్పుడే ప్రతిలిపి వారు మొదలు పెట్టిన "  ప్రతిలిపి ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం " కి హాజరయ్యాను . వారు చెప్పిన విషయాలు రచన మీద ఏ మాత్రం అవగాహన లేనివారికే అయినా శ్రద్ధగా మెళకువలు తెలుసుకున్నాను . అందులో భాగం గా " సౌరభం " అనే నవలని 184 భాగాలు రచించడం జరిగింది . అప్పటికి నేను ప్రతిలిపిలో ఓ సాధారణ రచయితని . లక్ష పైచిలుకు పాఠకులు ఉన్నా 200 మంది అనుచరులు ఉంటె నే గోల్డెన్ బ్యాడ్జి రచయిత కాగలం . అలాంటి గోల్డెన్ బ్యాడ్జి రచయితలకి మాత్రమే ప్రతిలిపి ప్రతి ఏడూ " సూపర్ రైటర్స్ అవార్డు కాంపిటీషన్ " ని పెడుతుంది . ఈ కాంపిటీషన్ లో ఇండియా , మిగతా దేశాల్లో ఉన్న రచయితలు కూడా పాల్గొంటారు . ఆన్లైన్ లో ఇచ్చే విశిష్ట మైన అవార్డు కూడా ఇది . నాకైతే ఆ కాంపిటీషన్ లో పాల్గొనేందుకు గోల్డెన్ బ్యాడ్జి లేదు . కాబట్టి ఆ పోటీలో పాల్గొనలేను ..అనుకున్నాను . కానీ సరిగ్గా ఆ పోటీ గడువు ఆరుమాసాలైతే మరో రెండు నెలలు ఉందనగా నాకు గోల్డెన్ బ్యాడ్జి వచ్చింది . నియమనిబంధనలు సరిగ్గా తెలుసు కోకుండానే ఆ పోటీ కి " జాగృతి " అనే నవలని రాయటం మొదలు పెట్టాను . గడువు తీరేలోగా వాళ్ళు చెప్పిన కండిషన్ ప్రకారం వెయ్యి పదాలతో కూడిన అరవై భాగాలూ పూర్తి చేశాను కానీ ..గడువు తీరేలోగా ఆ కథ ని ముగించలేకపోయాను . కానీ గోల్డెన్ బ్యాడ్జి ఉన్నవారి కథలు ప్రీమియం లోకి వెళతాయి కాబట్టి ..ఆ కథ ఎంతోమందికి చేరువై నాకు ప్రశంసలు తెచ్చిపెట్టింది . ఎందుకంటే " జాగృతి " వ్రాయటానికి నేను కొంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది . ఆ కథ నాకెంతో తృప్తి నిచ్చింది . ఇప్పుడు ప్రథిలిపి వారు నిర్వహిస్తున్న సూపర్ రైటర్స్ 6 కాంపిటీషన్ కోసం " వెన్నెల్లో ఆకాశం " అనే నవల రాస్తున్నాను . అందులో సెలెక్ట్ అవుతానో లేదో నాకు తెలీదు ..నాకు తెలిసిందల్లా ప్రయత్నం చేయటమే ..ఎగసే అలలా ఎన్నిసార్లయినా పడి లేస్తాను ..నా ప్రయత్నం ఆపను ..ఇప్పుడు రచయిత గా "రాధిక ఆండ్ర " ఎంతోమందికి తెలుసు . ఇది నా విజయమని తీర్మానించను ..ఇంకా గెలుపు కి దూరంలోనే ఉన్నాను ..కానీ ఆత్మ సంతృప్తికి చేరువగా ఉన్నాను . ఎందుకంటే నేను నాకిష్ట మైన పనినే చేస్తున్నాను .

ఇలా నా రచనా ప్రయాణాన్ని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చిన అశోక్ గారికి కృతజ్ఞతలు.

నా అడుగు గమ్యం వైపు సాగుతూనే ఉంటుంది ..మీ ఆశీస్సులు ఆ గమ్యాన్ని చేరుకునేలా చేస్తాయని ఆశిస్తాను, నమస్కారం .

                                                                             మీ రాధిక ఆండ్ర


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens